మహా వెలుగు 27 : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి నిశ్చితార్ద కార్యక్రమానికి బయలు దేరిన బస్సు బోల్తా పడింది . ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, మరో 49 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఈ రోజు నిశ్చితార్దం నిర్ణయించారు.
నిశ్చితార్దం కోసం బయల్దేరి..విషాదంలో
దీంతో..55 మందితో బయలు దేరిన బస్సు మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
