మహా వెలుగు హైదరాబాద్ :- మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లు పెరిగాయి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
పెంచిన రేట్లు ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన కూలీ రేట్ల ప్రకారం తెలంగాణలో రోజుకు రూ. 257 వేతనాన్ని కూలీలకు చెల్లించనున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది.
ఈ పథకం కింద రాష్ట్రంలో 3,803 కోట్ల రూపాయల వ్యయంతో 29లక్షల కుటుంబాలకు చెందిన 48 లక్షల మంది కూలీలకు పని కల్పించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే రాష్ట్రంలో 14 కోట్ల 67 లక్షల పని దినాలను లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 14 కోట్ల 9 లక్షలు పని దినాలు కల్పించారు. ఉపాధి హామీ పథకం చట్టం కింద ప్రతి ఆర్ధిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనులందరికీ గ్రామాల పరిధిలో వంద పని దినాలను కల్పిస్తూ కనీస వేతనం చెల్లిస్తున్నారు. చిన్న చిన్న నీటి పారుదల పనులు, చెరువుల్లో పూడికలు తీయడం, మొక్కల పెంపకం, గ్రామీణ ప్రాంతాల్లో రహదార్ల నిర్మాణం వంటి పనుల ద్వారా ఉపాధి కూలీలకు పని కల్పిస్తున్నారు