మహా వెలుగు హైదరాబాద్ : ఉగాది తెలుగు ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్ ‘శుభకృత్’ నామ సంవత్సరం ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఉగాది నుంచే నూతన సంవత్సరం ఆరంభమవుతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుంచే ప్రారంభించుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతికాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని సీఎం అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, వ్యవసాయం బాగుంటేనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు.
కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జీడీపీకి దోహదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోషిస్తుందని సీఎం పేర్కొన్నారు. అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్ట పరుచుకున్నామనీ, ‘శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలుగువారికి కొత్త సంవత్సరం..
ఉగాది (Ugadi).. మన తెలుగింటి తొలి పండగ. ఈ పండగతోనే.. తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. అందుకే ఇది తెలుగువారి మొదటి పండగ అయింది. చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే… ఇలా చెప్పుకుంటూపోతే ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి.
అయితే ఉగాది మనకు పచ్చి ప్రకృతి పండగలా అనిపిస్తోంది. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే… మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు.
