మహా వెలుగు వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న రోగి నిమ్స్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ చనిపోయాడు. రోగి శ్రీనివాస్ శరీరం పూర్తిగా ఇన్‌ఫెక్షన్ కావడం వల్లే వైద్యానికి సహాకరించలేదని వైద్యులు తెలిపారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తెచ్చిన గంటల వ్యవధిలోనే రోగి మృతి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న రోగి శ్రీనివాస్ చనిపోయాడు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిమ్స్ వైద్యులు శ్రీనివాస్‌కి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఎలుకలు కొరుక్కుతినడం వల్ల శ్రీనివాస్‌కి ఎంజీఎం లోనే అధికరక్తస్రావం అయింది. అపస్మారకస్థితిలో ఉన్న అతడ్ని శుక్రవారం సాయంత్రం నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి రాత్రి 12గంటల వరకు నిమ్స్ వైద్యులు శ్రీనివాస్‌ని కాపాడేందుకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే శ్రీనివాస్ ను నిమ్స్‌కి తరలించే సమయానికే శరీరం అంతా ఇన్‌ఫెక్షన్ అయిందని..వైద్యానికి సహాకరించకపోవడం వల్లే మృతి చెందినట్లుగా నిమ్స్ వైద్య బృందం స్పష్టం చేసింది. గత వారం రోజుల క్రితం శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్‌లోని ఎంజీఎంలో చేరాడు. ఉత్తర తెలంగాణకే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐసీయూలో ట్రీట్‌మెంట్ పొందుతున్న శ్రీనివాస్‌ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇన్‌పేషెంట్‌గా ఉన్న శ్రీనివాస్‌ని ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎలుకలు దాడి చేశాయి. రోగి అచేతన స్థితిలో ఉండటంతో ఎలుకలు మొదటిసారి చేతి వేళ్లు కొరకాయి. ఎంజీఎంలోని వైద్య సిబ్బంది కట్టుకట్టి చేతులు దులుపుకున్నారు. ఆతర్వాత మరోసారి శ్రీనివాస్ ఎడమ చేయి, కాలి మడమ కొరకడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతను అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
