హైదరాబాద్​లో మరోసారి డ్రగ్స్ కలకలం

మహా వెలుగు ,హైదరాబాద్ : హైదరాబాద్​లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో పుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా పబ్ లో డ్రగ్స్ లభ్యం కావడంతో పాటు, పలువురు ప్రముఖులు కూడా పట్టుబడటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తెలంగాణలో డ్రగ్స్ ను పోలీసులు అరికట్టలేకపోతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. డ్రగ్స్ విషయమై పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఫైర్​ అయ్యారు. డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఎన్ కౌంటర్ చేస్తే తన సంపూర్ణ మద్దతు కేసీఆర్ కు ‘ఉంటుందని రాజా సింగ్​ అన్నారు.

డ్రగ్స్ కేసుల్లో రెండు రోజులు హడావిడి చేసి మళ్లీ కేసును పక్కన పడేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో గతంలో నమోదైన డ్రగ్స్ కేసులు ఏమయ్యాయని రాజాసింగ్ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో వీఐపీలుంటే ఆ కేసును నీరుగారుస్తున్నారని రాజాసింగ్ విమర్శించారు. తెలంగాణను డ్రగ్స్​ అడ్డాగా చేస్తున్నారని రాజా సింగ్​ విమర్శించారు.

తెలంగాణలో డ్రగ్స్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయం పోలీసులకు తెలవదా. అని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు. ఏ మూలన ఏం జరుగుతుందో అన్నీ పోలీసులకు తెలుసన్నారు. కానీ కొద్ది రోజులు షో చేసి వదిలేస్తారని రాజాసింగ్​ విమర్శించారు. రాష్ట్ర యువత ఏమైనా కేసీఆర్ కి అవసరం లేదని రాజాసింగ్​ ఆరోపించారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని రాజాసింగ్​ డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి మూలాలను కనిపెట్టాల్సిందిగా ఆయన సూచించారు. డ్రగ్స్ కొనుగోలు చేసే వారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లోని పబ్​లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా బంజాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన రాడిసన్ బ్లూ అనేది అంతర్జాతీయ హోటల్, క్లబ్ చైన్ కాగా, బంజారాహిల్స్ లోని ఫ్రాంచైజ్ పబ్.