– ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజం
మహా వెలుగు మంచిర్యాల : టీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో సోమవారం టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది. ఇందులో భాగంగానే మందమర్రి ,జైపూర్ , మండల కేంద్రంలో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విప్ సుమన్ ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో పండిన ప్రతి వరి, గోధుమ గింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విప్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేదాక మోదీ ప్రభుత్వాన్ని వదిలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలిపారు.
కేంద్రం వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందే రైతులకు సూచించారన్నారు. వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. వరి కొనిపిస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ లను నియంత్రించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్న విప్, రాష్టాలలో పండిన పంటలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాలకు తరలించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల దేశంలో ఆకలి కేకల సూచీ అధ్వానంగా కింది స్థాయికి పడిపోయిందన్నారు.తెలంగాణ రాష్ట్రం వల్లే సోమాలియా తరహా ఆకలి కేకలు దేశం లో తప్పాయన్నారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలకు చరమగీతం పాడాలని విప్ సుమన్ పిలుపు నిచ్చారు.
