మానుకోటలో వరి దీక్ష

మహా వెలుగు, మహబూబాబాద్ ,ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర రైతు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లా పిలుపునందుకుని ,రాజీలేని పోరాటాలు చేస్తామని, రైతు పండించిన వడ్లు కేంద్రం మేడలు వంచి కొనిపించే వరకు ఈ పోరాటం ఆపమని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

రైతు వ్యతిరేఖ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన రైతు నిరసన దీక్షలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొని, ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు.పంజాబ్ లో రైతులతో పెట్టుకుని ఈ కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రైతులతో పెట్టుకుంటుంది. ఇలాగే చేస్తే తెలంగాణలో బీజేపీ నేతలు తిరగని పరిస్థితి వస్తుందని ధ్వజమెత్తారు.

తెలంగాణ లో పండించిన పంటలో నూకలు ఉంటాయి, మాకు బియ్యం ఇచ్చి మీ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పించండి అని అహంకారంతో బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు.

మేము నూకలు, జొన్నలు, గట్క తిని వచ్చాం. మా బియ్యం కొనకపోతే మీకు నూకలు తినిపిస్తా ధాన్యం కొనుగోళ్లలో దేశమంతా ఒక పద్దతి ఉండాలి. కానీ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక పద్దతి, తెలంగాణ రాష్ట్రానికి ఇంకో పద్దతి పాటిస్తున్నారు. తెలంగాణ రైతును అవమానిస్తున్నారు. ఇక్కడ పండిన ప్రతి గింజా మద్దతు ధర ఇచ్చి కొనాలి. అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు బిడ్డ అన్నారు.

యాసంగిలో వడ్లు వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్పారు. ఊరూరా ప్రచారం చేశారు.కానీ తల, తోక, అవగాహన లేని మూర్ఖ తొండి సంజయ్ యాసంగిలో వరి వేయమన్నరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాసంగి వరి కొనే బాధ్యత నాది అన్నారు. సీఎం కేసిఆర్ చెప్పారు అంటే అందులో నిజం ఉంటుంది అని నమ్మిన రైతులు 53 లక్షల ఎకరాల నుంచి 34 లక్షలకు వరి సాగు తగ్గించారు.

యాసంగి ఒడ్లు కొనం..నూకలు కొనం… తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలి అని ఈ బీజేపీ నేతలు అన్నారు. మేము నూకలు, జొన్నలు, గట్క తిని వచ్చాం. నువ్వు పెట్టుబడిదారివి. మేం బియ్యం పండించక పోతే నువ్వు నూకలు తినాలి.

నాడు 30 లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు అయితే ఇప్పుడు కోటి 30 లక్షల ఎకరాలలో సాగు అవుతుంది. తెలంగాణ ప్రజలు మూడు పూటలు అన్నం తింటున్నాం. ఒకప్పుడు పండగకు అన్నం తింటే సీఎం కేసిఆర్ ముందు చూపు వల్ల ప్రతి రోజూ బియ్యం అన్నం తింటున్నాం.

ఖబర్దార్ బీజేపీ. మా వడ్లు కొనకపోతే మిమ్మల్ని గద్దె దించుతాం. ఒక జిల్లాలో నిరసన చేస్తేనే ఇంతమంది వస్తె.. రైతులంతా కలిసి ఢిల్లీకి కదిలితే మీ పీఠం కదులుతుంది జాగ్రత్త.అహంకారంతో ఉన్నవారిని, రైతు వ్యతిరేక నాయకుల మెడలు వంచే విద్య వెన్నతో పెట్టిన విద్య మా నాయకునికి సొంతం. మా రైతుల ప్రయోజనాలు కాపాడే నాయకుడు మాకున్నడు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పగలు కూడా కరెంట్ ఉండేది కాదు. కానీ సీఎం కేసిఆర్ నాయకత్వంలో నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందుతుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు వలసలు వెళ్లిన రైతులు ఈ ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. కరెంట్ ఇస్తే సరిపోదు రైతుకు పెట్టుబడి కూడా ఇవ్వాలని రైతు బంధు ఇస్తున్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దు అని రూ.5 లక్షల రూపాయల బీమా కల్పించిన ఏకైక నేత సీఎం కేసిఆర్ అని తెలిపారు.రైతు పండించిన పంట అంత కొని రైతును రాజు చేస్తున్న నాయకుడు సీఎం కేసిఆర్ ,కేంద్రం మెడలు వంచాల్సి వస్తె కేసిఆర్ వంటి నాయకునికే సాధ్యం అని, బీజేపీ వ్యతిరేఖ పార్టీలను ఏకం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే నాయకుడు కేసిఆర్ అని గుర్తించి ఆయన మీద కక్ష కట్టి రైతుల మీద దానిని ప్రయోగం చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసిఆర్ కి రైతులంటే ఇష్టమని, వారిని కేసిఆర్ కు దూరం చేయాలనే కుటిల నీతి, కుటిల రాజకీయం చేస్తున్న బీజేపీ నేతల్లారా…బిడ్డా ఖబర్థార్.కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చే రైతు బంధు ఆపొద్దు అని మా జీతాలు కట్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు వేసిన రైతు నాయకులు సీఎం కేసిఆర్ అని వారు స్పష్టం చేశారు.

ఈరోజు రైతు నిరసన పెద్ద ఎత్తున చేయాలని ఏర్పాట్లు చేస్తే పోలీసులు కొంతమంది ఇబ్బంది కల్పించారు. నిన్నటి నుంచి వేసిన టెంట్లు తీయించారు. కానీ వీటికి భయపడం. రైతు కాలిలో ముళ్ళు విరిగితే పంటితో తీసే ప్రభుత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పోరాటం ఆగదు. గొప్పగా చెప్పుకునే గుజరాత్ లో క్రాప్ హాలిడే ఇచ్చారు.కానీ తెలంగాణలో నిరంతర కరెంట్, సాగు నీటి సరఫరావల్ల రైతులు కేసిఆర్ గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

యాసంగిలో వరి వేస్తే కొంటాం బీజేపీ బండి సంజయ్ ఎక్కడా…? వరి వేస్తే ప్రతి గింజా కొనిపిస్తా అన్న కిషన్ రెడ్డి ఎక్కడ ఉన్నావు? వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయండి. తెలంగాణలో పండిన ప్రతి గింజ కేంద్రం కొనే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రైతులు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ జెడ్పి చైర్ పర్సన్ బిందు తదితరులు పాల్గొన్నారు.