మహా వెలుగు, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇవాళ ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌ని సత్కరించారు. రోడ్డు పక్కన కారు ఆపి మరీ సన్మానించారు. ఎంతకి ఆ హోంగార్డ్ ఏం చేశారంటే…
ఆయన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్. అంటే రాష్ట్ర పరిధిలోని న్యాయవ్యవస్థ మొత్తానికి బాస్. అంత పెద్ద పదవిలో ఉన్న ఆయన.. ఇవాళ ఓ ఊహించని పని చేశారు. సాధారణ వ్యక్తిలా రోడ్డు పక్కన కారు ఆపి.. ట్రాఫిక్ హోంగార్డ్‌ని అభినందించారు. పుష్ప గుచ్ఛం అందించి రోడ్డుపైనే సత్కరించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఇంతకి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ హోమ్గార్డ్ను ఎందుకు సత్కరించారు? ట్రాఫిక్ హోంగార్డ్ ఏం చేశారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ సన్మానించిన హోంగార్డ్ పేరు అష్రఫ్ అలీ. అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నారు. అబిడ్స్‌లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రతి రోజూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులు నిర్వర్తిస్తుంటారు. రోజూలాగే ఇవాళ కూడా డ్యూటీ చేశారు అష్రఫ్ అలీ. ఐతే ఉదయం 8 గంటల సమయంలో అటుగా ఓ కారు వచ్చి.. రోడ్డు పక్కన ఆగింది. కారులో నుంచి లాయర్ దుస్తుల్లో ఓ వ్యక్తి బయటకు దిగారు. ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్‌ని పిలవడంతో వెళ్లారు. ఎవరో లాయర్ అని మొదట అనుకున్నారు. కానీ ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ అని కారు డ్రైవర్ చెప్పడంతో హోంగార్డ్ షాక్ తిన్నారు. ‘సార్.. నమస్కారం’ అని పలకరించారు. అనంతరం చీఫ్ జస్టిస్ సతీష చంద్ర పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. అష్రఫ్ అలీ పని విధానం, డ్యూటీ పట్ల నిబద్ధత తనకు ఎంతగానో నచ్చాయని.. బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి అభినందించడంతో ట్రాఫిక్ హోంగార్డ్ అష్రఫ్ ఉబ్బితబ్బిపోయారు.
అష్రఫ్ అలీ.. తన డ్యూటీ పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. సమయ పాలన ఖచ్చితంగా పాటిస్తారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విషయంలో కూడా పక్కాగా ఉంటారు. ఎలాంటి గందరగోళం ఉండదు. తాను పనిచేసే సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా జామ్ కాకుండా చూసుకుంటారు. ఎండలు మండుతున్నా అక్కడి నుంచి అస్సలు కదలరు. మండుంటెండల్లో కూడా ట్రాఫిక్ బూత్‌లోనే ఉండి డ్యూటీ చేస్తారు. హైకోర్టుచీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రతిరోజూ అదే రూట్లో హైకోర్టుకు వెళ్తుంటారు. చాలా సార్లు అష్రఫ్ అలీని చూశారు. డ్యూటీ పట్ల ఆయనకున్న నిబద్ధత చీఫ్ జస్టిస్‌కు ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలోనే గురువారం హైకోర్టుకు వెళ్తుండగా.. అబిడ్స్‌లో కారును ఆపి.. హోంగార్డ్ను సన్మానించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ కావడంతో హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు ఆ హోంగార్డ్పైనా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా.. హోమ్ గార్డ్ డ్యూటీ మెచ్చి.. ఆయన్ను ప్రశంసించడం గొప్ప విషయమని చీఫ్ జస్టిస్‌ను ఆకాశానికెత్తుతున్నారు. ఇక ఎంతో నిబద్ధతతో డ్యూటీ చేస్తున్న అష్రఫ్ అలీని కూడా అభినందించారు. సిన్సియర్‌గా డ్యూటీ చేస్తే.. గుర్తింపు దానికదే వస్తుందనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
