సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ ప్రతినిధి,ఏప్రిల్ -08: సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కే శశాంక వైద్య అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ప్రైవేట్, ప్రభుత్వ గైనాకాలజిస్ట్ వైద్యులతో సాధారణ, సిజెరియన్ ప్రసవాలపై సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని, అనవసరంగా శస్త్ర చికిత్సలు చేయవద్దని, సాధ్యమైనంత మేరకు సాధారణ ప్రసవాలు జరిగే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఏ రకంగా ముందుకు వెళ్తే, ప్రయత్నం చేస్తే నార్మల్ ప్రసవాలు పెరిగే అవకాశం ఉన్నది ఆలోచించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో కంటే ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కువగా సిజేరియన్ లు జరుగుతున్నాయన్నారు. ఆడిట్ చేయడం జరుగుతుందని, వాస్తవ పరిస్థితులను వైద్య అధికారులు సమీక్షించాలని తెలిపారు.

సిజెరియాన్ పెరగడానికి జిల్లాలో అనీమియా 68 శాతం, తొందరగా పెళ్ళిలు జరుగుతున్న కారణం ఉన్నదని, గర్భం దాల్చిన నాటి నుండి డెలివరీ వరకు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ద్వారా పర్యవేక్షిస్తున్న అనీమియా 68 శాతం ఉండడం పై DWO ద్వారా సమీక్షించుకోవాలి అని, చిన్న వయస్సులో పెళ్లిలు జరగకుండా సఖి, DWO అధికారులు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గర్భం దాల్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించి డెలివరీ అయ్యే వరకు ఆశ, ఏ.ఎన్.ఎం.లు పర్యవేక్షిస్తూ వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

సౌత్ ఇండియన్ స్టేట్స్ లో 35 శాతం, తెలంగాణ రాష్ట్రం లో 61 శాతం ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో 74 శాతం సిజెరియన్ శాతం ఉన్నదని తెలిపారు. జిల్లాలో సిజెరియన్ శాతం ఎక్కువగా ఉండడానికి గల కారణాలను సమీక్ష చేసి సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, DWO స్వర్ణలత లినీన, పి. ఓ. బిందుశ్రీ, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్. ఓ. అంబరీష, డాక్టర్ మురళీధర్, PO., NVBDCP డాక్టర్ సుధీర్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకట్రాములు, CHC గూడూరు సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, డిప్యూటీ డి.ఎం. ఓ. శ్రీధర్, వైద్యాధికారులు డాక్టర్ అర్జున్ రెడ్డి, డాక్టర్ ఇంద్ర సేన రెడ్డి, డాక్టర్ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.