రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. కాని ప్రజల సమస్యలపై పోరాటం చేసేటప్పుడు మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగే యుద్ధం ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ , టీఆర్‌ఎస్ ,మధ్య అలాంటి వాతావరణమే నెలకొంది. అయితే రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే ..రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు దిగారు. అయితే బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం కోసం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ఇప్పుడు ఆ పార్టీ నేతల పరువు తీశాయి. గమ్మత్తైన విషయం ఏమిటంటే..ఢిల్లీలో టీఆర్‌ఎస్ నేతలు వరి ధాన్యం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడుతున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఇదెక్కడి విడ్డూరం అయ్యా..
అయితే ఫ్లెక్సీలో వరి ధాన్యానికి బదులుగా గోధుమలు ఫోటో పెట్టడమే ఇక్కడ బీజేపీ నాయకుల చిత్తశుద్ధిని బయటపెట్టిందని టీఆర్‌ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా జాగో తెలంగాణ అంటూ వడ్లకు, గోధుమలకు తేడా తెలియని సన్నాసులు ఏకుతాం, పీకుతాం అంటూ చేస్తున్న నినాదాలు అన్నదాత హక్కుల కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటాన్ని తప్పు దోవ పట్టించడానికే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీ శ్రేణులు చేసిన పొరపాటును సోషల్ మీడియా తో పాటు పార్టీ వెబ్ సైట్, పార్టీ వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తూ బీజేపీ నేతల్ని కడిగిపారేస్తున్నారు.
ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికే..
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల తరహాలోనే కొనుగోలు చేయాలన్నది టీఆర్‌ఎస్ డిమాండ్. ఈవిషయంలోనే గత నెల రోజుల నుంచి కేంద్రంతో కేసీఆర్ సర్కారు ఢీ అంటే ఢీ అంటోంది. రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేయాలని..ధాన్యం కొనుగోలు చేయకపోతే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లుతాయని పార్టీ శ్రేణులు వినూత్న రీతిలో గత వారం పది రోజుల నుంచి ఆందోళనలు, నిరసన దీక్షలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సోమవారం ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
బీజేపీ నేతల్ని ట్రోల్ చేస్తున్న టీఆర్‌ఎస్..
రాష్ట్ర అధికార పార్టీ నేతలు ఢిల్లీలో పోరాడుతుంటే ..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం హైదరాబాద్‌లో రైతు ఉద్యమం పేరుతో ధర్నాకు దిగారు. అయితే రైతులకు న్యాయం చేసే విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు హస్తిన వేదికగా పోరాటం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉండేది. కాని హైదరాబాద్‌లో చేయడం…అందులో వరికి బదులుగా గోధుమల ఫోటోలు పెట్టడంతో అసలుకే ఎసరువచ్చినట్లైంది.
