చిన్న పరిష్కారం అయిన ఆలోచన గొప్పది కాబట్టి వారి మెధస్సుకు మనం గౌరవం ఇవ్వాలి : కలెక్టర్ కె. శశాంక

మహా వెలుగు ప్రతినిధి, మహబూబాబాద్, ఏప్రిల్ – 11:రాష్ట్ర స్థాయిలో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ కె. శశాంక అభినందించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రగతి సమావేశ మందిరంలో 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ ఇంక్విలాబ్, యూనిసెఫ్ లు సంయుక్తంగా నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా నుండి పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినిలను జిల్లా కలెక్టర్ కె. శశాంక అభినందించారు. జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. మనది మారుమూల జిల్లా అయినప్పటికి అవకాశం ఇస్తే మనం ఏ స్థాయికి వెల్తామనేది ఈ చిన్నారులు నిరూపించారని, పోటీలలో నిలిచి గెలిచి జిల్లాకు పేరు తీసుకొచ్చారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. మన దేశం పెద్ద దేశం కాబట్టి క్రియేటివ్ ద్వారా, ఇన్నోవేషన్ గా వినూత్నంగా ఆలోచించి మన సమస్యలకు పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఇన్నోవేషన్ కౌన్సిల్ ను ఏర్పాటు చెసుకొని నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలోని 5387 పాఠశాలల నుండి 11 వేల 37 ఆవిష్కరణలు అందగా, మన జిల్లా నుండి 212 పాఠశాలల నుండి 191 ఆవిష్కరణలను అప్లోడ్ చేయడం జరిగిందని, ఇందులో నుండి 18 జిల్లాలకు సంబంధించి 20 ఆవిష్కరణలు ఎంపిక కాగా, ఈ నెల 4న హైదరాబాద్లో నిర్వహించిన ఫైనల్ ప్రదర్శనల పోటీలలో నెల్లికుదురు మోడల్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుచున్న రితికా, 10 వ తరగతి చదువుచున్న కీర్తన లు ప్రదర్శించిన మల్టీపర్పస్ పోర్టబుల్ రూమ్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతితో పాటు 2 లక్షల 50 వేల నగదు బహుమతిని మంత్రి కే.టి.ఆర్. చేతుల మీదుగా పొందడం సంతోషకరమైన విషయమని కలెక్టర్ తెలిపారు.

చిన్న పరిష్కారం అయిన ఆలోచన గొప్పది కాబట్టి వారి మెధస్సుకు మనం ఇవ్వాల్సిన గౌరవం అని, జాతరలు, పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ ప్రోడక్ట్స్ ను ఉపయోగించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖాధికారులను కోరారు. జిల్లాలో ప్రతిభగల విద్యార్థిని విద్యార్థులకు కొదవలేదని అవకాశం ఇస్తే వారిలో దాగి ఉన్న ప్రతిభతో జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని, జిల్లా అధికారులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల మేధస్సుకు పదును పెడుతూ వారిలో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వినూత్నంగా ప్రదర్శింప చేసేందుకు వారిని ప్రోత్సహించాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్ధినీలు కీర్తన, రితికా తమ ఆవిష్కరణను జిల్లా కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో స్త్రీలు చిన్న పిల్లలకి ఫీడింగ్, దుస్తులు మార్చుకునే సందర్భంలో సులభంగా ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చని, అలాగే ఎక్కడికి అయిన సులవుగా తీసుకునే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆవిష్కరణ గైడ్ గా వ్యవహరించిన టీచర్ కె. నాగార్జున్ ను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం.డేవిడ్ లు సన్మానించారు. ఇద్దరు విద్యార్థినులకు డిక్షనరీ లను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎండి అబ్దుల్ హై, తదితరులు పాల్గొన్నారు.