మహావెలుగు స్టాఫ్ రిపోర్టర్ కపిల్ కుమార్.వి మహబూబాబాద్ 20 : వచ్చే నెల ఆరు, ఏడు తేదీలలో జరిగే రాహుల్ గాంధి సభల్లో బీసీల సమస్యలపై ప్రత్యేక తీర్మానం చెయ్యాలని శంతన్ రామరాజు కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటి చైర్మన్ మధుయాష్కీ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు. రాహుల్ సభల సన్నాహక చర్యల్లో భాగంగా బుధవారం మానుకోటకు వచ్చిన మధుయాష్కీ గౌడ్ పూలే జంక్షన్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా శంతన్ రామరాజు మధుయాష్కీ గౌడ్ కు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈసందర్భంగా రామరాజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా జరుగబోయే వరంగల్ బహిరంగ సభల్లో దేశంలో, రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానం చేయాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ హక్కులను కాలరాస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు.
ఈ ఏడేళ్ళ కాలంలో బడ్జెట్లో బీసీలకు నామమాత్రపు నిధులు కేటాయించడమే కాకుండా వాటిని పూర్తిగా వేరే రంగాలకు ఖర్చుచేసి బీసీల మోసం చేస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన నిధులు, నియామకాలు, రిజర్వేషన్లు, ప్రమోషన్లలో తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదేశంలో ఈరాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చర్చిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఈకార్యక్రమంలో బీసీ నేతలు సాగర్ రామరాజు, జనగం సాయి కుమార్, గాండ్రతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
