- రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపిస్తాం
- వెంటనే దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించాము
- దీనిపై సమగ్రంగా సమీక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం
- హత్యకు గురైన రవి నాయక్ మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్
వి.కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
(మహబూబాబాద్, ఏప్రిల్ 21) :

మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవి హత్య పై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
రవి నాయక్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ లో పరిశీలించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఇలాంటి వాటికి తావులేదని తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో సమీక్షించి, మళ్లీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటాము.
ఎంపీ ,ఎమ్మెల్యే, అధికారులు తో కలిసి దీనిపై చర్చించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా వాటిని తీసుకుంటాం.
హత్య చేసిన వారు ఎంత పెద్ద వారైనా…ఉన్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకుని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని, అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

పోలీసు మొత్తం ఇప్పుడు అదే పనిలో ఉన్నారని,ఏది ఏమైనా మహబూబాబాదులో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియ జేశారు.
