పి.ఎం. కిసాన్ లబ్దిదారులందరికీ రుణ సదుపాయం కొరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ లు జారీ చేయాలి…..

వి.కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్, ఏప్రిల్ -21:

ఒక ప్రత్యేక డ్రైవ్ ద్వారా పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరికీ రుణ సదుపాయము కల్పించడానికి కిసాన్ క్రెడిట్ కార్డులను జారి చేయాలని నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాఘవేంద్ర రావు సంయుక్తంగా నేడోక ప్రకటనలో తెలిపారు.

కిసాన్ క్రెడిట్ కార్డులు పొందుటకు దరఖాస్తుతోపాటు భూమి యొక్క పట్టా తాలూకా జిరాక్స్ కాపీ పంట వివరములను సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లో సమర్పించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకుల వారు ఈనెల 24 నుండి మే ఒకటి వరకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పీఎం కిసాన్ లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి లబ్దిదారులకు 14 రోజులలో కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయాలని తెలిపారు.

ప్రత్యేక శిబిరంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, ఎన్.ఆర్.ఎల్.ఎం. ప్రాజెక్ట్ యొక్క బ్యాంక్ సఖీ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించి సంబంధిత బ్యాంకు బ్రాంచిల ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డులు పొందుటకు సహకరించాలని సూచించారు.

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయం పొంది పశుపాలన, మత్స్య కారు పరిశ్రమలను ఏర్పాటు చేసిన పక్షంలో వారికి అదనపు క్రెడిట్ పరిమితిని కల్పించడం జరుగుతుందని, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 3 లక్షల రూపాయల రుణ సదుపాయం పొందవచ్చని, ఎటువంటి ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్స్పెక్షన్ చార్జీలు లేకుండా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు.

పీఎం కిసాన్ లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులపై పంట రుణాలు మాత్రమే కాక పాల ఉత్పత్తులు, గొర్రెలు, మేకల, కోళ్ళ, పందుల, బాతుల పెంపకం కు కావలసిన పని మూలధన అవసరములకు కూడా రుణ సదుపాయము బ్యాంకుల ద్వారా కల్పించబడుతుందని వారు ఆ ప్రకటనలో తెలిపారు.