- ఆధునీకరించిన జిల్లా మహిళా సంక్షేమ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్.కపిల్ కుమార్, మహబూబాబాద్.26 ; తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గర ఆధునీకరించిన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలతా లెనినా, ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు అంతే గౌరవంగా చూడాలని, సిఎం కేసిఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. గిరిపోషణ, పోషణ్ అభియాన్ లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అవార్డులు కూడా రావడం మన అంగన్వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పోషకాహారాన్ని అందించడం ద్వారా రక్తహీనతను నివారించేందుకు గిరిపోషణ అమలు చేస్తున్నామన్నారు. దీంతో పాటు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా కేసిఆర్ న్యూట్రిషియన్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 1,25,000 లబ్దిదారులలో రక్తహీనత నివారణ కోసం ఈ కిట్ అందించనున్నామన్నారు.

ఆరోగ్య పరంగా మహిళలు, శిశువులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి అంగన్వాడీలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని తెలిపారు. కేసిఆర్ కిట్ వల్ల ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగాయని, మాతా, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల బాల్య వివాహాలు తగ్గాయని, పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా మారిందన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో ఉండే ఖాళీలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో 30 రాష్ట్ర స్థాయి పోస్టులు భర్తీ చేయనున్నామని, 600పైగా సూపర్ వైజర్ స్థాయి పోస్టులకు కూడా పరీక్షలు నిర్వహించాము త్వరలో వీరికి ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు.
కార్యక్రమం అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్ బ్యాగులలో సానిటైజర్లు, మాస్కులు, జీసీసీ సబ్సులు, షాంపులు, హ్యాండ్ వాష్ లు కలిపి అంగన్వాడీలకు అందించారు. వీటితో పాటు జిల్లాలోని 1437 అంగన్వాడీ సెంటర్ల కోసం ఒక్కో అంగన్వాడి కేంద్రానికి 10 ప్లేట్స్, 10 గ్లాసుల చొప్పున అందించే కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు.
