మహా వెలుగు హైదరాబాద్ 27 : దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెరాస తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు అని చెప్పారు.ఎన్నో ఒడుదొడుకులు, అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న తెరాస ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడారు.. తొలుత ప్లీనరీ వేదికపై తెరాస జెండాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. దేశానికే రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని.. కేంద్రం, వివిధ సంస్థల నుంచి వస్తున్న అవార్డులే తెలంగాణ ప్రగతికి నిదర్శనమని కేసీఆర్ చెప్పారు. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.

కఠినంగా వ్యవహరించినందునే ఈ ఫలితాలు
”కఠిన నిర్ణయం తీసుకుని నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చాం. 85 శాతం మొక్కలు దక్కకుంటే తెరాస అయినా సర్పంచ్, గ్రామ కార్యదర్శి ఉద్యోగాలు పోతాయని చెప్పాం. పల్లె ప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్ పెట్టాం. మంత్రులు, ఎమ్మెల్యేలను దీనిలో భాగస్వామ్యం చేశాం. అందుకే ఈ ఫలితాలు వచ్చాయి. జ్ఞానాన్ని స్వీకరించే గుణం ఉండాలి.. అన్నీ మనకే తెలుసనే అహంకారం ఉండకూడదు.అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టీ తెరాస.

పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసుకుంటే మరింత సస్యశ్యామలం అవుతుంది. అంకితభావంతో పనిచేసినందునే రాష్ట్రంలో నేడు విద్యుత్ సమస్య లేదు. ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలు. కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారు. ఆ తరహా పరిస్థితి తెలంగాణలో లేదు. ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరింది. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం.

