ప్రాణాన్ని బలికొన్న అప్పు  స్నేహితుడి ఇంటి వద్ద నిరసన.. అక్కడే మృత్యువాత

కరీంనగర్ : అప్పు చివరకు ప్రాణాన్ని బలికొన్నది.  అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వలేదనే బాధతో అతని ఇంటి ముందు నిరసనకు దిగిన వ్యక్తి చివరికి అక్కడే ప్రాణాలను వదిలారు.

ఈ సంఘటన సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో గురువారం జరిగింది విషాదం.

కేశవపట్నం ఏఎస్సై మల్లారెడ్డి కథనం ప్రకారం.. మెట్ పల్లి గ్రామానికి చెందిన ఈరెల్లి సంపత్(35) ఒగ్గు కళాకారుడు. అదే గ్రామానికి చెందిన స్నేహితుడు సతీష్ కు  మూడేళ్ల కిందట రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. ఏడాది తరువాత సతీష్ రూ.3 లక్షలు తిరిగిచ్చాడు. రూ.7 లక్షలు జులై 15, 2021లో ఇచ్చేలా పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రం రాసుకున్నారు. గడువు తీరినా ఇవ్వకపోవడం, పలుమార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో ఈ నెల 16 నుంచి సతీష్ ఇంటి ఆవరణలో ప్రధాన ద్వారానికి ఎదురుగా మంచంపై పడుకుని నిరసనకు దిగారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురవగా, తల్లిదండ్రులు భోజనం పెడుతూ మాత్రలు వేస్తూ వచ్చారు. ఈ పరిణామాలతో సతీష్, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని ఎటో వెళ్లిపోయారు. అప్పు తిరిగి రాలేదనే మనోవేదనకు.. అనారోగ్యం తోడై బుధవారం రాత్రి సంపత్ అక్కడే మరణించారు. సంపత్ మరణానికి సతీష్ కారణమంటూ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. సతీష్ ఇంటి ముందే మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. అప్పు తిరిగివ్వలేదనే బాధతో స్నేహితుడి ఇంటి వద్ద నిరసన.. అక్కడే మృత్యువాత చెందాడు.