- స్వయం సమృద్ధి డిపోగా అభివృద్ధి చేయండి
- గిరిజన ప్రజలు ఉండే మానుకోటలో ప్రజా రవాణా వ్యవస్థ తప్పనిసరి
- మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయినందున ఆర్టీసి సర్వీసులు మరింత పెంచాలి
- ఆర్టీసి చైర్మన్ కు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ లేఖ
వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/హైదరాబాద్, ఏప్రిల్. 29 : ఆర్టీసి సంస్థ మహబూబాబాద్ జిల్లా ప్రజలను మహబూబాబాద్ డిపో ద్వారా వారి గమ్య స్థానాలకు చేర్చడంలో గత 33 ఏళ్లుగా అందిస్తున్న సేవలు అత్యంత విశేషమైనవని మహబూబాబాద్ జిల్లా కేంద్రం అయిన నేపథ్యంలో ఈ జిల్లా ఆర్టీసి డిపోను మరింత పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఈ డిపోను స్వయం సమృద్ధిగా అభివృద్ధి చేయాలని కోరుతూ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి లేఖ రాశారు.
మహబూబాబాద్ ఆర్టీసి బస్సు డిపో నుంచి ఇటీవల కాలంలో కొన్ని బస్సులను ఇతర డిపోలకు తరలిస్తున్నారని, తిరిగి వాటిని డిపోకు తెప్పించాలని కోరుతూ జిల్లా ఆర్టీసి డిపోకు చెందిన కొంతమంది ఉద్యోగులు మంత్రిగారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ఆర్టీసి డిపో నుంచి బస్సుల తరలింపుపై వార్తలు రావడం, ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు ఆర్టీసి సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారితో మాట్లాడి, ఈ డిపోను పటిష్టం చేయాలని లేఖ రాశారు.
మహబూబాబాద్ లో 1989 సంవత్సరం నుంచి ఆర్టీసి తన సేవలు అందిస్తోందని, జిల్లా ప్రధాన కేంద్రం నుంచి లక్షన్నర మంది ప్రయాణికులకు , మొత్తం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి 7.75 లక్షల మందికి రవాణా సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. ప్రతి రోజు 75 బస్సులు, 33 మార్గాల్లో 27వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ 28వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతూ 70 శాతానికి మించిన ఆక్యుపెన్సీ నిష్ఫత్తి సాధిస్తోందని తెలిపారు.
అయితే కొన్ని మార్గాల్లో తక్కువ ఆక్యుపెన్సి నిష్పత్తి ఉందని, రెవెన్యూ సరిగా లేదనే కారణాలతో ఆ మార్గాల్లోని బస్సులను ఇతర డిపోలకు తరలించడం వల్ల ప్రజలకు రవాణా వసతిలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయని, పేద ప్రజలు తమ ప్రజా రవాణా హక్కును కోల్పోతారని తెలిపారు.
జిల్లా కేంద్రంగా మహబూబాబాద్ కొనసాగుతున్న ఈ సమయంలో జిల్లాలోని ఆర్టీసి డిపో నుంచి ఇతర డిపోలకు బస్సులను తరలించడం ఆపేసి, ఇప్పటికే తరలించిన బస్సులను తిరిగి తెప్పించి, డిపోను మరింత పటిష్టం చేయాలని ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. డిపోలో బస్సులను పెంచి, ఆక్యుపెన్సీ నిష్పత్తిని పెంచి, డిపోను స్వయం సమృద్ధిగా అభివృద్ధి చేయాలని విజ్ణప్తి చేశారు. ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా డిపోను బలోపేతం చేయాలన్నారు.
