- మిషన్ భగీరథ ఇబ్బందులున్న చోట వెంటనే ప్రత్యామ్నాయ వసతులు కల్పించాలి
- కిలోమీటర్ల దూరం, చెలిమెల వెంట గిరిజనులు తిరిగే పరిస్థితి కనిపించవద్దు
- అవసరమైతే వెంటనే బోర్లు వేయండి…ట్యాంకర్లతో నీరు అందించండి
- వెబినార్ లో అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు
వి. కపిల్ కుమార్, మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ హైదరాబాద్, ఏప్రిల్. 29 : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని, అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఎండాకాలంలో మారుమూల, సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో తాగునీటి వసతులపై మంత్రి సత్యవతి రాథోడ్ నేడు హైదరాబాద్, సంక్షేమ భవన్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు.
వెబినార్ లో మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్….
తెలంగాణ ప్రభుత్వం రాకముందు గ్రామాలకు తాగునీటి కొరత ఉండేది. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు ఇచ్చేవారం. గిరిజన గ్రామాల గోస చెప్పేది కాదు.
ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరథ తెచ్చాక దాని ద్వారా 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్నాం. ఆగిపోయిన ఆ ఒక్క శాతం కూడా సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలే.
మొత్తం రాష్ట్రంలో మిషన్ భగీరథ ఇబ్బందులున్నవి 105 ఆవాసాలు మాత్రమే. వీటిల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ కరెంటు లేక తాగునీటి సమస్య ఉంది.
ముఖ్యమంత్రి ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించారు. కరెంటు లేనిచోట సోలార్ ద్వారా విద్యుత్ అందించాలన్నారు.
విద్యుత్ సౌకర్యం కల్పించి, నీటి వసతి అందిస్తుంటే…ఏ ఒక్క గ్రామంలో కూడా బిందెలు ఎత్తుకుని దూరం పోవడం, చెలిమల్లో నీరు తీసుకున్నా మనకు మంచిగా అనిపించదు. 99 శాతం చేసి, ఒక్క శాతం వద్ద చెడ్డపేరు రావద్దు. గిరిజన ప్రాంతాల్లోని కలెక్టర్లు, ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ఈ సమస్య రాకుండా చూడాలి.
గతంలో రాష్ట్రంలో సగం ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో 30,40 నివాసాలకు ట్యాంకర్లు ఇవ్వడం కష్టం కాదు. కాబట్టి ఈ ఎండాకాలం మొత్తం తాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన చోట వాటర్ ట్యాంకర్లతో నీరు అందించాలి. అవసరమైన చోట్ల బోరు వేయాలి.
సుదూర ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా నీటి వసతి ఏ విధంగా కల్పించవచ్చు, కానీ పక్షంలో ప్రత్యామ్నాయ విధానాలు ఏమున్నాయని ఆలోచించి, వాటిని వెంటనే అమలు చేయాలి.
తాగునీటి వసతి లేని గిరిజన ఆవాసాలు ఉండకూడదు. ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలి. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని స్థానికంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలి. లేనిపక్షంలో ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకొచ్చి పరిష్కరించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలు, పాఠశాలలకు మిషన్ భగీరథ నీరు ఇవ్వాలి. గ్రామానికి కేటాయించిన నీటిని అక్కడి స్థానిక హాస్టళ్లకు ఇవ్వడం ద్వారా గ్రామానికి నీటి కొరత రాకుండా ప్లాన్ చేసుకోవాలి.
నిన్న ఒక మహిళ ఆస్పత్రి నుంచి డెలివరీ అయి 10 మైళ్లు నడుచుకుంటూ వెళ్లిందని వార్త వచ్చింది. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రసవం అయిన తర్వాత తల్లీ, బిడ్డను ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలు పెట్టాము. అయినా ఎందుకు ఈ పరిస్థితి ఉంది? అని విచారించి, తగిన చర్యలు చేపట్టాలి. ఎవరైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి .
కోవిడ్ కష్టకాలంలో కూడా సీజనల్ వ్యాధులు రాకుండా బాగా పనిచేశారు. మనం చేపట్టిన పల్లె ప్రగతి, మిషన్ భగీరథ నీరు సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టడంలో చాలా తోడ్పడ్డాయి.
కాబట్టి ఇకపై తానేనీరు ఇవ్వని ప్రాంతాలు, ఆవాసాలు మన రాష్ట్రంలో ఉండకూడదు. బిందెలతో రోడ్డెక్కడం కనిపించవద్దు. అవసరమైన బోర్లు వేయాలి, ట్యాంకర్లతో నీరు ఇవ్వాలి. ఎండా కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
