దేవుడు అన్యాయం చేసినా..ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేస్తుంది

  • ములుగు జిల్లా శనిగకుంట అగ్రిప్రమాద గుడిసె బాధితులను అక్కున చేర్చుకుని అమ్మలా ఓదార్చిన…
  • రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

వి. కపిల్ కుమార్ మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్/ములుగు.01 : అగ్నిప్రమాదం రూపంలో దేవుడు మీకు అన్యాయం చేసినా… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాల అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదివారం ములుగు జిల్లా, మంగపేట మండలం, శనిగకుంట గిరిజనులకు ధైర్యాన్ని కల్పించారు.

సర్వం కోల్పోయి దు:ఖిస్తున్న మహిళలు, పిల్లలను ఓదార్చారు. కాలిపోయిన గుడిసె ప్రాంతానికి వెళ్లి ఆయా కుటుంబల బాధలు విన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ములుగులో అగ్ని ప్రమాదంలో గిరిజన కుటుంబం ఇళ్లు కాలిపోయి, పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అంతా దగ్దం కావడంతో బోరున విలపిస్తుంటే…ఉద్యమ నాయకుడిగా ఆనాడు కేసిఆర్ తీవ్రంగా చలించి, ప్రభుత్వం వచ్చాక పేదింటి ఆడపిల్ల పెళ్లికి తల్లిదండ్రులకు భారం కావద్దని కళ్యాణ లక్ష్మీ తీసుకొచ్చారని, దీనివల్ల ఎంతోమంది లబ్ది పొందుతున్నారని చెప్పారు. ఇక్కడ కూడా అగ్నిప్రమాదం జరిగి గుడిసెలు కాలి, కూడబెట్టుకున్నదంతా మంటల్లో అగ్గిపాలు కావడం అత్యంత దురదృష్టకరం, విషాదకరమన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అధైర్యాన్ని వీడి, ధైర్యంగా ఉండాలని, మీకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వారికి కావల్సిన వంట సామాగ్రి, నిత్యావసరాలు అందించారు.

గిరిజన సంక్షేమ శాఖ నుంచి నస్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. 25వేల రూపాయలు, రెవెన్యూ శాఖ నుంచి 15 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నామన్నారు. అదేవిధంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రతి మహిళకు, పిల్లలందరకీ 10వేల రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్ధిక సాయాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నామన్నారు.

వీటితో పాటు తాత్కాలిక వసతుల కోసం వెంటనే ఒక్కో దానికి దాదాపు 7వేల రూపాయల చొప్పున షెల్టర్లు ఏర్పాటు చేశామని, ఉండడానికి కావల్సిన వసతులు, భోజనం అందిస్తున్నామన్నారు. వీటిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు కాలిపోయిన స్థలాన్ని చదును చేసి, గ్రావెల్ తో సమానం చేసి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకునేందుకు త్వరలోనే 3 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం కూడా అందుతుందని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. అంతే కాకుండా నిర్మాణ్ సంస్థ ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో మోడల్ కాలనీ నిర్మించి ఇస్తామని ధీమా కల్పించారు.

అగ్ని ప్రమాదంలో కూడబెట్టుకున్న దానితో పాటు పిల్లల సర్టిఫికేట్లు కూడా కాలిపోయాయని, వెంటనే వీరు చదివిన విద్యా సంస్థలతో అధికారులు సంప్రదించి, ఆ సర్టిఫికేట్లు అన్ని ఇప్పిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాలు వేయడంతో, ఉచిత కోచింగ్ కూడా ప్రారంభమైనందున ఇక్కడున్న ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎకనామికక్ సపోర్ట్ స్కీమ్ కింద ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, ప్రభుత్వ పరంగా జరగాల్సిన అన్ని రకాల సాయాన్ని వెంటనే అందించడానికి ఒక అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సత్య సాయి ట్రస్ట్ , ప్యూర్ సంస్థ ముందుకు వచ్చి బాధితులకు నిత్యావసరాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు.

ఐటిడీఏ నుంచి పరుపులు, చీరలు, దోతులు, బెడ్ షీట్లు, మెత్తలు, అవసరమైన ఇతర సామాగ్రిని బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. అనంతరం వారికి ఏర్పాటు చేసిన షెల్టర్లలో ప్రభుత్వం అందిస్తున్న భోజనాన్ని అందరితో కలిసి తిన్నారు.

మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఉన్నారు.