బహిర్భూమికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలను అరికట్టడానికి జగన్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, తాజా హోం మంత్రి తానేటి వనిత మహిళలు, బాలికల రక్షణకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా మహిళలు, బాలికలపై కామాంధులు రెచ్చిపోతున్నారు.

నిత్యం ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు జగన్ పాలనలో ఏపీ అత్యాచారాంధ్ర ప్రదేశ్ గా మారుతుందని విమర్శలు చేస్తున్నారు. అత్యాచారాలను అరికట్టటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఏపీలో మరో అత్యాచార ఘటన చోటుచేసుకుంది.

అనకాపల్లి లో జరిగిన ఈ దారుణ ఘటనలో ఓ ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లాలో రాత్రి రెండుగంటల సమయంలో అక్కాచెల్లెళ్లు బహిర్భూమికి వెళ్ళగా అక్కడ బాలికను బలవంతంగా లాక్కెళ్ళి గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆరు సంవత్సరాల వయసున్న అభం శుభం తెలియని చిన్నారిపై సదరు మానవ మృగం అత్యాచారం చేశాడు. బాలిక రోదిస్తున్నా వదలకుండా తన కామ వాంఛ తీర్చుకున్నాడు.

బాలికను ఎత్తుకుపోవడంతో చెల్లిని ఎవరో ఎత్తుకెళ్లారు అని తల్లిదండ్రులకు బాలిక సోదరి వచ్చి చెప్పింది. దీంతో హుటాహుటిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలలో చిన్నారి జాడ కోసం వెతికారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలికపై అత్యాచారం చేసింది పక్కింట్లో ఉంటున్న సాయి అంటూ అనుమానంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.