గిరిజన మహిళపై పలు మార్లు అత్యాచారం.. అపస్మారక స్థితిలో ఉన్నా వదలని దుర్మార్గుడు

మహా వెలుగు ,యాదాద్రి భువనగిరి జిల్లా 11 : రెక్కాడితే కానీ డొక్కాడని పేద గిరిజన కుటుంబం వారిది. పగటివేళ భర్త పనికి వెళ్లగా చూసిన ఓ దుండగుడు అతడి భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. మొదటిసారి లైంగికదాడి తర్వాత ఆమె అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది. అపస్మారక స్థితి లో ఉన్న కూడా ఆ దుర్మార్గుడు వదలలేదు.

ఆమె ప్రాణాలు కోల్పోయాక కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకునే పారిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేటలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాత్రి సమయానికి పోలీసుల దృష్టికి వచ్చింది. వారు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. 24 గంటలలోపే నిందితుడిని వెతికి పట్టుకున్నారు.

అతడి నుంచి వివరాలు రాబడుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. భయంతోనే నిందితుడు ఆమెను చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పొట్టకూటి కోసం వలస వస్తే..
హత్యాచారానికి గురైన గిరిజన మహిళది నాగర్ కర్నూలు జిల్లా కోడూరు మండలంలోని ఓ గిరిజన తండా. మార్చి 13న ఆమె భర్తతో పాటు తూప్రాన్ పేటకు వలస వచ్చింది. వారిద్దరూ హైదరాబాద్ – విజయవాడ హైవే సమీపంలోని ఒక గోదాం వద్ద కాపలా దారులుగా ఉంటూ అక్కడే ఉంటున్నారు. భర్త పగటివేళ సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

సోమవారం ఉదయం అతను డ్యూటీ కి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా సమీపంలోని గడ్డివాము దగ్గర విగతజీవిగా, రక్తపుమడుగులో, నగ్నంగా పడి ఉంది. ఆయన వెంటనే బావమరిదికి, అత్తమామలకు, పోలీసులకు సమాచారం అందించాడు. రాత్రికి రాత్రే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి ఆధారాలు సేకరించి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు.

ఆమెపై రెండుసార్లు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.
ఒంటరిగా ఉంటుందని గమనించి..
మహిళపై అత్యాచారం చేసింది సంగారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు (24) అని పోలీసులు గుర్తించారు. అతడు సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు బాధితురాలు ఒంటరిగా ఉండటంతో నిందితుడు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం మహిళా ఉంటున్న గోదాం దగ్గరకు వెళ్లి ఆమెపై లైంగికదాడి యత్నం చేయడంతో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసి ఉంటుందని, అక్కడినుంచి పట్టుకుని గడ్డివాము సమీపంలోకి లాక్కొచ్చి లైంగిక దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

లైంగిక దాడి అనంతరం బాధితురాలు పరుగెత్తుతుండగా కర్రతో తలపై బలంగా మోది ఉంటాడని.. ఆమె పడిపోగా ముఖం, తలపై విచక్షణారహితంగా కొట్టడంతో ప్రాణాలు కోల్పోయి ఉంటుందని భావిస్తున్నారు. ఆ తర్వాత మృతదేహంపై మరోసారి లైంగిక దాడి చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న వెండి పట్టీలు, బంగారు తాళిబొట్టును నిందితుడు అపహరించుకుపోయారు. నిందితుడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వాసి అని తెలుస్తోంది.

ఆ మహిళ ఒంటరిగా ఉండడం చూసి.. వెంటాడి, వేటాడి ఈ అత్యాచారానికి తెగించాడు. చౌటుప్పల్ ఏసిపి ఉదయ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.