మహా వెలుగు , ఢిల్లీ 17 : వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ త్రివిధ దళాల్లో నియామకాలకు అగ్నిపథ్ పేరిట కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. నాలుగేండ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు 17.5-21 ఏండ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ పూర్తయ్యాక తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన అగ్నివీరుల్లో 25 శాతం మందినే శాశ్వత కమిషన్‌లో పని చేసేందుకు అవకాశం కల్పిస్తారు. మిగిలిన వారు వెనుదిరగాలి.
దరఖాస్తు, అర్హతలు, సెలక్షన్ ఇలా..
అగ్నిపథ్ స్కీమ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు కేంద్ర డాటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎంపిక ఆటోమేటిక్ పద్ధతిలో ఉంటుంది. మహిళలూ అర్హులే. అయితే ప్రత్యేక రిజర్వేషన్ ఉండదు.
అభ్యర్థుల వయసు 17.5-21 ఏండ్లు(తాజా సవరణతో) వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలను బట్టి ఎంపిక చేస్తారు. ఈ ఏడాది 46 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నారు.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పని చేయాల్సి ఉంటుంది.
తొలుత ఆరు నెలలు శిక్షణ ఇస్తారు. తర్వాత మూడున్నరేండ్లు సర్వీసు సమయంగా పరిగణిస్తారు.
నాలుగేండ్ల తర్వాత తుది పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపించిన అగ్నివీరుల్లో 25 శాతం మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తారు. మిగతా వారు వెనుదిరగాలి.
అభ్యర్థుల అభ్యంతరాలు ఇవి..
అగ్నిపథ్ ద్వారా సాయుధ దళాల్లో చేరి నాలుగేండ్లు సేవలు చేశాక.. తుది పరీక్షలో ఉత్తీర్ణులు కాకుండే పరిస్థితి ఏంటి?
నాలుగేండ్లు శిక్షణ ఇచ్చారు కాబట్టి.. ఆర్మీలో వేరే పోస్టుల్లో ప్రభుత్వం నియమిస్తుందా? నియమించకుంటే.. అంత డబ్బు ఖర్చు చేసి అభ్యర్థులకు 48 నెలలు శిక్షణ ఇవ్వడం ఎందుకు? ప్రజాధనం వృథా చేయడానికేనా..?
నాలుగేండ్లు సైన్యంలో విధులు నిర్వహించి.. సెలెక్ట్ కాకపోవడంతో ఇంటి దారి పట్టిన అభ్యర్థులు.. మళ్లీ కొత్త ఉద్యోగం కోసం చదువుకోవాలా? అప్పటికే కొన్ని ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థుల వయసు దాటిపోతుంది కదా! దీనికి ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుంది?
జనరల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా చేరిన వారిని ఆర్మీలో 17 ఏండ్ల పాటు కొనసాగిస్తూ, రిటైర్ అయ్యాక పింఛన్ ఇస్తున్నారు. మరి అగ్నిపథ్‌లోని అగ్నివీరులకు పింఛన్ ఎందుకు కట్ చేస్తున్నారు? వేతనాలు, ర్యాంకులు ఎందుకు తక్కువగా ఇస్తున్నారు? దేశ రక్షణలో కీలకపాత్ర పోషించే సాయుధ బలగాలను ఆర్థిక దృక్కోణంలో చూడటం ఎంత వరకు కరెక్ట్?
అగ్నిపథ్‌ను తీసుకొచ్చిన కేంద్రం.. రెగ్యులర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను కూడా నిర్వహిస్తుందా? దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?
కఠోర శిక్షణను పూర్తి చేసి, వైద్య, దేహదారుఢ్య పరీక్షలను దాటుకొని అభ్యర్థులు అంత కష్టపడి అగ్నిపథ్‌లో ఎంట్రీ సాధిస్తే నాలుగేండ్ల తర్వాత మళ్లీ తుది పరీక్ష ఎందుకు?