అర్ధరాత్రి ఫోన్‌.. భర్త వార్నింగ్‌.. గంట తర్వాత చూస్తే..

మహా వెలుగు చేవెళ్ల: అర్థరాత్రి ఫోన్‌ ఎందుకు మాట్లాడుతున్నావని భర్త మందలించటంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమ్మెట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన ప్రకారం వివరాలు… చేవెళ్ల మండలంలోని కమ్మెట గ్రామానికి చెందిన బండ మహేశ్‌ వ్యవసాయం చేసుకుంటూ కుంటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అతని భార్య బండ అమృత (19) బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడుతుండటం చూసి ఈ సమయంలో ఎందుకు ఫోన్‌ మాట్లాడుతున్నావని మందలించాడు. అంతే వెంటనే ఫోన్‌ కట్‌ చేసి పడుకుంది. భర్త మరో గంట తర్వాత లేచి చూసేసరికి భార్య కనిపించలేదు. బెడ్‌రూం డోర్‌ గడియ బయట నుంచి పెట్టి వెళ్లిపోయింది.
ఎలాగోలా బయటకు వచ్చిన భర్త మహేశ్‌ చుట్టుపక్కల ఎంత వెతికిన కనిపించలేదు. ఆమె ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌చేయగా ఒకసారి రింగ్‌ అయి తర్వాత మళ్లీ చేస్తే స్విచ్‌ఆఫ్‌ వస్తుందని తెలిపారు. దీంతో గురువారం చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో తన భార్య కనిపించటం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.