- ఊర్లో ఉంటావా ఊర్లు పట్టుకొని తిరుగుతావా దొర: బండి సంజయ్ కౌంటర్; టిఆర్ఎస్ రివర్స్ కౌంటర్
మహా వెలుగు ,హైదరాబాద్ 02 : శనివారం తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, మోడీ రాకతో సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని, వెన్నులో వణుకు పుడుతోందని కెసిఆర్ ను టార్గెట్ చేస్తున్నారు బిజెపి నేతలు.
మోడీ రెండురోజులు ఇక్కడే.. ఊర్లో ఉంటావా?కేసీఆర్: బండి సంజయ్
ముఖ్యంగా బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ మోడీ పర్యటన వేళ ఊర్లో ఉంటాడా? ఊరు వదిలి వెళ్తారా అంటూ సెటైర్లు వేశారు. ఫిబ్రవరిలో మోడీగారు నగరానికొస్తే జ్వరమని ఫామ్ హౌస్ లో పడుకున్నాడని సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అంతే కాదు మొన్న హైదరాబాద్ వస్తే పక్కరాష్ట్రానికి జారుకున్నాడని సీఎం కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. రెండు సార్లు మోడీ పర్యటన సమయంలో ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు.
ఇక మళ్ళీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి 2రోజులు ఇక్కడనే ఉంటున్నాడు మోడీగారు అని పేర్కొన్న బండి సంజయ్ ఊర్లోనే ఉంటావా? ఊర్లు పట్టుకొని తిరుగుతావా దొరా? అంటూ కేసీఆర్ పై సెటైర్ వేశారు. అంతేకాదు తెలంగాణ సీఎం కేసీఆర్.. నీ మేకపోతు గాంభీర్యాలు బరాబర్ బయటపెడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సాలు దొర సెలవు దొర అంటూ టార్గెట్ చేశారు.
కడుపులో విషం పెట్టుకొనేటోళ్ళను కలిస్తే ఎంత? కలవకపోతే ఎంత?: టీఆర్ఎస్
ఇక బండి సంజయ్ చేసిన ట్వీట్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ కడుపులో విషం పెట్టుకొని, కల్లబొల్లిమాటలు మాట్లాడేటోళ్ళను కలిస్తే ఎంత? కలవకపోతే ఎంత? అంటూ మోడీని కలవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేసింది. ఎక్కువ తక్కువ సప్పుడు చేయకుండా మీటింగ్ అయిపోగొట్టుకుని బిర్యానీ తిని, ఛాయ్ తాగి వెళ్ళండి అని టార్గెట్ చేసింది.
మూటలేమో గుజరాత్ కు, విద్వేషపు మాటలేమో తెలంగాణకా? చల్ హట్!
చూసిన తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ ను ఫాలోకండి అంటూ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలని, మోడీ పర్యటన ను టార్గెట్ చేసింది. మూటలేమో గుజరాత్ కు, విద్వేషపు మాటలేమో తెలంగాణకా? చల్ హట్! అంటూ సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ పార్టీ అధికార ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సాలు మోడీ సంపకు మోడీ అంటూ ఎదురు దాడికి దిగింది.
ఫుల్ బిజీలోనూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న బండి.. ఎవరూ తగ్గట్లేదుగా!!
ఒకపక్క బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న అతిథులను ఆహ్వానిస్తూ, కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉంటూనే మరో పక్క సీఎం కేసీఆర్ టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. ఇక బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలు సైతం నిప్పులు చెరుగుతున్నారు. మరి రెండు రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న సమావేశాల నేపధ్యంలో మరి ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా వెళ్తుందో వేచి చూడాలి.