రైతు భీమా డబ్బుల కోసం తల్లి చావు కోరాడు….

మహా వెలుగు,నల్గొండ, ఆగష్టు 01:కొడుకు తల్లి చావు కోరుకోడు. కాని అతను మాత్రం కేవలం డబ్బు కోసం బ్రతికున్న తల్లి లేదని ప్రభుత్వాన్ని మోసం చేశాడు. నవమాసాలు మోసి కనిపించిన తల్లికి చనిపోయిందని నమ్మించి ..అందుకు వచ్చిన ప్రతిఫలంతో ఎంజాయ్ చేశాడు. విషయం ఆ మాతృమూర్తికి తెలియడంతో ఆశ్చర్యపోయింది. తన బిడ్డేనా ఇంతటి నీచానికి ఒడిగట్టిందని బాధపడింది. కొడుకు పరువు తీయాలనే ఉద్దేశంతో కాకుండా తాను బ్రతికే ఉన్నానని నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆ కొడుకు బండారం బయటపడింది. నల్గొండ జిల్లాలో రైతుబీమా డబ్బుల కోసం ప్రభుత్వాన్ని కన్నతల్లిని మోసం చేశాడో వ్యక్తి.

ప్రభుత్వానికే తప్పుడు రిపోర్ట్ ..

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కో లింగమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అదే గ్రామంలో టిఫెన్‌ సెంటర్ నడుపుతుండగా అతని దగ్గరే ఉంటోంది తల్లి. లింగమ్మ పేరుతో లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చలిచీమలపాలెం శివారులో తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి ప్రభుత్వం ఏదాడి రైతుబంధు పథకం కింద డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అయితే గత ఏఢాది నుంచి తనకు రైతుబంధు పథకం నిధులు జమ కాకపోవడంతో లింగమ్మ జులై 16వ తేదిన వ్యవసాయశాఖ అధికారిణి రుపేంద్రమణిని కలిసి విషయం చెప్పింది. ఆమె ఆన్‌లైన్‌లో లింగమ్మ పేరు చెక్‌ చేయడంతో అసలు విషయం బయటపడింది

లింగమ్మ కొడుకు వీరస్వామి కాసుల కక్కూర్తితో బ్రతికున్న తల్లిని చనిపోయినట్లుగా తప్పుడు ధృపత్రాలు సృష్టించాడు. కేవలం తల్లి రైతుబీమా పథకం పేరులో తాను నామినీగా ఉండటంతో తల్లి చనిపోయిందని తెలిస్తే 5లక్షల రూపాయలు వస్తాయని బంధువు , గ్రామ ఉపసర్పంచ్‌ కోల సైదులు సహకారం తీసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌ 6న తన తల్లి లింగమ్మ చనిపోయినట్లుగా నకిలీ కాగితాన్ని సృష్టించాడు. అదేనెల 16న వ్యవసాయాధికారికి రైతుబీమా డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నకిలీ పత్రాన్ని సృష్టించిన నెల రోజుకు అంటే.. 2021 మే6న సూర్యాపేట యూకో బ్యాంకులో ఉన్న వీరస్వామి ఖాతాలో రైతుబీమా తాలుకు సొమ్ము జమైంది. వచ్చిన డబ్బుతో దర్జాలు వెలగబెట్టిన వీరస్వామి ..తాను చేసిన తప్పును తల్లితో చెప్పకుండా దాచిపెట్టాడు.