మహా వెలుగు, ములుగు, ఆగష్టు 01:న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మాడుగుల మల్లారెడ్డి(58) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి 7గంటల సమయంలో ములుగు జిల్లా మల్లపల్లి మధ్య ఉన్న పందికుంట క్రాస్‌రోడ్డుకు సమీపంలో ఆయనపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి నరికి చంపారు. మల్లంపల్లి నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆయన కారును వెనుక నుంచి వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. రోడ్డు పక్కన కారు ఆపి కిందకు దిగిన మల్లారెడ్డిపై బొలెరో వాహనంలో వచ్చిన ఐదుగురు దాడి చేశారు. మల్లారెడ్డి కారు డ్రైవర్‌ను బెదిరించడంతో పరారైనట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో మల్లారెడ్డిని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపేశారని సమాచారం. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మల్లారెడ్డి హత్యకు భూ వివాదాలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మైనింగ్ భూములకు సంబంధించిన విషయంలో గతంలోనూ ఆయనపై దాడులు జరిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దివంగత ప్రజాప్రతినిధి వర్గంతో కూడా విబేధాలు కలిగి ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది
