బిగ్ బ్రేకింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే కు రాజీనామా…

మహా వెలుగు.ఆగష్టు 02:ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని ఆరోపించారు. కేవలం కేసీఆర్ కోసమే తెలంగాణ తెచ్చినట్టు అనిపిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి.. రాష్ట్రానికి అప్పులకుప్పగా మార్చేశారని విమర్శించారు. సామాన్య పేద కుటుంబాల్లో సంతోషం లేదని అన్నారు. తెలంగాణ వచ్చిన ఫలితాలు కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. అప్పుల కారణంగా తెలంగాణలో శ్రీలంక తరహా పరిస్థితులు వచ్చినా.. రావొచ్చని అన్నారు. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని.. కానీ అవేవీ ఫలించలేదని అన్నారు.

కొద్దిరోజుల నుంచి తన రాజీనామాపై చర్చ జరుగుతోందని.. అయితే ఈ చర్చను ఉద్దేశ్యపూర్వంగా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తన రాజీనామా ద్వారా ఉప ఎన్నిక జరగబోయే మునుగోడులో ప్రజలకు మేలు జరుగుతుందని.. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే గౌరవం ఉందని.. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడటం బీజేపీకి మాత్రమే సాధ్యమని తెలిపారు.

పార్టీ తనకు ఎందుకు చర్యలు తీసుకుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడిన తమకు కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు తిట్టిన వాళ్లకు పదవులకు ఇచ్చి వాళ్ల కింద పనిచేయాలని తమకు చెప్పడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ కోసం తాము కష్టపడి.. బయట నుంచి వచ్చిన వ్యక్తులను ముఖ్యమంత్రులను చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ నుంచి సమయం తీసుకుని తన రాజీనామా లేఖను సమర్పిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలోనే తమ నియోజకవర్గంలో కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పార్టీ మారే ముందు వేల మంది ప్రజలను కలిశానని తెలిపారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తెలంగాణలో అరాచక పాలన పోవాలంటే ప్రధాని మోదీ, అమిత్ షా నాయకత్వంలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఉపఎన్నిక వస్తే ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయాల గురించి మాట్లాడబోనని.. ఆయన రాజకీయాలు గురించి ఆయనే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.