
భద్రాద్రి కొత్తగూడెం పినపాక 05: గిరిజన మూగ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో చోటు చేసుకుంది.
కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. సింగిరెడ్డిపల్లికి చెందిన ఓ గిరిజన మూగ యువతి తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన హనుమంతుల సర్వేశ్వరావు (45) ఆ మూగ యువతిని బైక్ పై ఎక్కించుకొని దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లాడు. అయితే ఆ యువతి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు అంతటా గాలింపు చర్యలు చేపట్టారు. ఓ గంట గడిచాక హనుమంతుల సర్వేశ్వరావు అదే బైక్ పై యువతిని తీసుకొచ్చి ఆమె ఇంటి ముందు దింపాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా హనుమంతుల సర్వేశ్వరావు అత్యాచారం చేసినట్లు యువతి సైగలతో తెలిపింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.
అయితే ఓ ఫోన్ రిసీవ్ చేసుకున్న పోలీస్ అధికారి ఆ యువతిని మీరే పోలీస్ స్టేషన్‌కు తీసుకు రావాలని వెటకారంగా సమాధానం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఏమి చేయాలో తెలియక 100కు డయల్ చేయగా వెంటనే పోలీసులు వచ్చి వివరాలు తెలుసుకొని హనుమంతుల సర్వేశ్వరావు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. కాగా, ఇదే గ్రామంలో హనుమంతుల సర్వేశ్వరావు వేరే యువతులపై ఐదు సార్లు అత్యాచారం చేశాడని స్థానికులు ఆరోపించారు. హనుమంతుల సర్వేశ్వరావు పెద్ద సైకో అని వెంటనే అతనిపై కఠిన చర్యలు తీసుకొని గిరిజన మూగ యువతికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు.
