- 70ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలి ఘటన ఇదే..
- మునుగోడుపై తొలి రక్తపు మరక
- 15సార్లు సాధారణ, రెండోసారి ఉప ఎన్నిక
- ఎన్నికల చరిత్రలో తొలిసారి చిందిన రక్తం
మహా వెలుగు ,మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో తొలి సారి రక్తపు మరక పడింది.. నియోజకవర్గ ముఖ చిత్రంపై తొలిసారిగా రక్తం చిందింది.. గతంలో 1952 నుంచి చిన్నకోడూరు ఉండగా.. 1967లో మునుగోడు నియోజక వర్గంగా ఏర్పడింది. ఈ నియోజక వర్గంలో 17వ సారి ఎన్నికలు జరుగుతుండగా.. 15సార్లు సాధారణ ఎన్నికలు, రెండో సారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 70ఏళ్ల మునుగోడు రాజకీయ చరిత్రలో తొలి సారి ఉప ఎన్నికల్లో ఇలాంటి ఘటన మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది.
ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఏ రెండు పార్టీలు కొట్టుకోలేదు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి అనేక పర్యాయాలు లోకసభ, శాసన సభ ఎన్నికలు జరిగాయి. సమస్యాత్మక గ్రామాలు ఉన్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన మునుగోడు నియోజక వర్గంలో పలు సమస్యాత్మక గ్రామాలు ఉన్నప్పటికీ ఇంతగా రాజకీయ పార్టీలు ఘర్షణ పడిన సంఘటనలు లేవు. రక్తం చుక్క చిందింది లేదు. నేడు తొలిసారిగా ఆ ఘట్టానికి తెరలేపారు. పలివెల గ్రామం ఒకప్పుడు మావోయిస్టులకు మంచి పట్టుండేది.
ప్రముఖ సమర యోధుడు, మాజీ ఎమ్మెల్యే కొండవీటి గురునాదరెడ్డి స్వగ్రామం ఇది. ఈటల రాజేందర్ సతీమణి జమున అమ్మ గారి ఊరు. ఈ గ్రామ ప్రజలకు ఆమెపై, ఈటలపై ఎంతో అభిమానం ఉంది. అసలు అక్కడి ప్రజలు ఆయనపై దాడి చేసేంత కోపం.. పరిస్థితులు లేవు. ఇదంతా కావాలనే ఓ పథకం ప్రకారం చేసినట్లుగా ఉందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు అప్పటికే తమ వాహనాల్లో రాళ్లు తెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఏదేమైనా మునుగోడు నియోజక వర్గ ముఖచిత్రంపై తొలిసారిగా రక్తపు మరక చిందింది.